మలక్ పేట్, హైదరాబాద్
5 అక్టోబర్, 2016
5 అక్టోబర్, 2016
కేసీఆర్ కు ప్రేమ'లేక' !
'దసరా రోజు వాళ్ళు మాత్రం ఎందుకు బాధపడాలె' అంటూ జిల్లాలు జిల్లాలే సృష్టిస్తున్న ఓ ముఖ్యమంత్రీ! మల్లన్న సాగర్, నిమ్జ్, ఫార్మాసిటీ, గ్రీన్ సిటీ ప్రాంతాల గ్రామీణులు, రైతులు, కూలీలు, కౌలుదారులు... ప్రజలు కాదా? దసరా రోజు సరదా వద్దా? మొన్ననే అంటివి. బతుకమ్మ ప్రజల జీవితాలను పచ్చగ ఉంచాలె అని. మరి ఆచరణలో ఏం చేస్తున్నరు?
ఈ రోజుకు కూడా రహస్యంగా నిన్ను అభిమానించే జనపు వెర్రి అభిమానానికి కారణం తెలుసా? తెలంగాణ తెచ్చిన మొనగాడివని. అదొక్కటే కారణం. నీ మందీ మార్బలం చూసి కాదు. నీ డబ్బూదస్కం కాదు. నీ చుట్టూ ఉన్న పోలీసు పహారాకి భయపడి కాదు. భయపడడానికి ప్రజలేమన్నా మీడియానా?
జనంతో నడిచినోనివి. జనాన్ని వొదిలేస్తే నీకు దిక్కు ఎవరూ ఉండరు. నీ ఇంగిలిపీసు కొడుకు నిన్ను రక్షించలేడు. వదిలేసి వెళ్ళిపోతాడు. నీ అతి స్వార్థపరురాలైన కూతురు ఆదుకోదు. బంగారు నగల దుకాణాలు లీజుకు తీసుకుని హాయిగా ఉంటది. కులపిచ్చి ఉన్న నీ అల్లుడు నిన్ను ఏమైనా చేయగలడు అనడానికి సమీప చరిత్ర చూస్తే అర్థం అయితది.
ఎన్టీరామారావులా నీవు వీరుడివి. ఆయనలాగే నీకు కులం, ధనం, యావ పెద్దగా లేవు. సరిగ్గా ఉంటే చరిత్రలో నిలిచిపోతావు. ఎందుకయ్యా చరమాంకంలో పనికిరాని కూతుళ్ళూ, అల్లుళ్ళూ, కొడుకులూ, దత్తపుత్రులూ, స్నేహితురాళ్ళ కోసం అడగకుండానే ప్రాణాలైనా యిచ్చే ప్రజల్ని ముంచాలని చూస్తారు మీరంతా? ఏమైపోతాయి ఉద్యమకాలపు నికార్సైన దుందుడుకు ప్రజామోహాలు?!
సప్తసముద్రాలు దాటి సైడు కాలువలో పడ్డట్టు - మనకాలం కంటే ముందు వాళ్ళూ, మన సమకాలీన రాజకీయ ఉద్ధండులూ ఏమవుతున్నారో ఎరుకజేసుకో. చచ్చామో బతికామో కూడా తెలీకుండా; ఎవరు రక్షిస్తున్నారో ఎవరు స్లోపాయిజన్ అయి భక్షిస్తున్నారో తెలీకుండా కాలగర్భంలో కలిసిపోతున్నారు.
'ఈ కర్ణులు పదివేవురైన అనినొత్తురు చత్తురు' అంటే సుయోధనుడు వినలేదు. ఇపుడు మీరూ వింటారని నమ్మకం లేదు. బలుపు ప్రజావలపును కమ్మేస్తుంది. కొడుకులూ కూతుళ్ళే శాశ్వతం కానపుడు ఈ పీఆర్వోలు ఉంటరా మీతో. ఒక్క సెకను చాలదు వాళ్ళ విశ్వాసం స్విచ్ అవడానికి! ఎందుకయ్యా, ప్రజల స్వేచ్చాజీవనానికి అడ్డువస్తావ్? వాళ్ళేం అపకారం చేశారని?
ఇదేదో, నీ దాకా చేరుతుందని, నువ్వు మారుతావని కాదు. వాతావరణ సమాచారం లాంటిది ఇది. నువ్వు వాతావరణం లాంటి వాడివి. నువ్వు మారడం కోసం కాదు సమాచారం. అంగీ లేకుండా వెళ్ళాలో, అన్ని సరంజామాలతో వెళ్ళాలో తెలియాల్సిన వాళ్లకు తెలియడం కోసమే.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. చరిత్రలో వెలిగే పేజీ అవుతావో, మలిగే దీపం అవుతావో నీ ఇష్టం. నువ్వు నిండు నూరేళ్ళు ఉండాలని కోరిక. ఆ ఉండడం ఎట్ల అన్నది నీ నిర్ణయం.
లవ్ యూ.
శ్రీశైల్ రెడ్డి పంజుగుల
కో-కన్వీనర్, ప్రజా తెలంగాణ
prajatelangana1@gmail.com
www.facebook.com/prajatelangana1
#PrajaTelangana